
రాజమండ్రి-తూర్పుగోదావరి
నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి నీటి విడుదల
విజయపురి సౌత్: ఎగువ నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 20 గేట్లను 15 అడుగులు, 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 5,03,268 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 586.80 అడుగులవద్ద నీరు నిల్వ ఉంది.
విజయవాడలో అర లీటర్ పాలు రూ.80
వరదల్లో మునిగిపోయిన విజయవాడలో పాల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. అర లీటర్ ప్యాకెట్ రూ.70-80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లల్లో పిల్లలున్నారని, కనీసం ఒక్క ప్యాకెటైనా ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దీంతో సమస్య పెరిగింది.
నేడు మరో 20 రైళ్లు రద్దు
భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను రద్దు చేసింది. మరో 160 రైళ్లను దారిమళ్లించింది. మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్- త్రివేండ్రం, హాతియా-బెంగళూరు, ఎర్నాకులం-హాతియా, జైపూర్-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్బాద్-కోయంబత్తూరు రైళ్లను రద్దుచేశారు.
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి బంపర్ ఆఫర్
ఏపీలో ఉచిత ఇసుక పాలసీని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా తీసుకెళ్లొచ్చని పేర్కొంది. ఉచిత ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీ నిఘా ఉంటుందని తెలిపింది.ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కలెక్టర్లు, ఎస్పీలతో నిఘా వ్యవస్థ మరింత పటిష్ట పరుస్తున్నారు సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుక విధానంలో ఏవైనా సమస్యలు ఉంటే 1800-599-4599కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఏపీలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని సూచించారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలని ఆదేశించారు. సరిగ్గా పని చేయలేదనే కారణంతో ఈరోజు జక్కంపూడిలో ఓ అధికారిని కూడా సస్పెండ్ చేశామన్నారు. గత ఐదేళ్లుగా అధికార యంత్రంగం సరిగా పని చేయడం లేదని ఆరోపించారు.
బాధితులకు అండగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
ముంపు ప్రాంతాల్లోని బాధితులకు రాష్ట్ర రోడ్డు,భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. విజయవాడలోని పాయకాపురం, కండ్రిగ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లోని 61, 62, 63, 64 డివిజన్లలోని వరద బాధితులకు మంత్రి జనార్ధన్ రెడ్డే స్వయంగా ట్రాక్టర్లో భోజనాలు, మంచినీరు, పాలు, మందు బిళ్లలు తీసుకెళ్లి అందజేశారు. భయాందోళనలో ఉన్న బాధితులకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఉండాలని ప్రజలను కోరారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక సిబ్బంది, ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ బాధితులను పునరావాస కేంద్రాలకు పంపించారు.